కమలంలో కల్లోలం..
తెలంగాణ బీజేపీ ఉలిక్కిపడింది. నేతలందరిలోనూ ఒకటే చర్చ..ఎందుకింత దారుణంగా పోల్చారు. హైకమాండ్ నుంచి తెలంగాణలోని నేతలవరకూ అందరినీ ఒక్క ట్వీట్ కలవరపరిచింది. తెలంగాణ బీజేపీనేత జితేందర్ రెడ్డి ట్వీట్ తో .. తెలంగాణ బీజేపీలో ప్రకంపనలు రేగాయి. ఆయన ఆట్వీట్ ను పోస్టు చేసి కాసేపటికే తొలగించారు. మరోసారి పోస్టు చేశారు. ఇది పార్టీలో కలకలం రేపుతుంటే.. కాంగ్రెస్ కు పదునైన అస్త్రం లభించినట్లైంది…
ఓ వ్యక్తి దున్నపోతులను తన్ని బండిలో ఎక్కిస్తున్న వీడియోనూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన జితేందర్ రెడ్డి.. రాష్ట్రంలోని బీజేపీనేతలకు ఇలాంటి ట్రీట్ మెంట్ కావాలన్నారు. అంతేకాదు.. ఈవీడియోను అమిత్ షా, బిఎల్ సంతోష్ లకు ట్యాగ్ చేశారు. కాసేపటికే దీన్ని తొలగించారు. అయితే అప్పటికే అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒకొక్కరు ఒక్కోలా నేతలు ప్రవర్తిస్తూ.. పార్టీలో ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారన్న ఉద్దేశ్యంతో జితేందర్ రెడ్డి ఈ ట్వీట్ చేసినట్లు భావిస్తున్నారు. తర్వాత మళ్లీ పోస్టు చేశారు.
దీనిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటరిచ్చారు. ఇంతకన్నా బీజేపీలో చేరిన వారిని పోల్చడం వీలుకాదంటూ సెటైర్లు వేశారు. అంటే బీజేపీలో చేరిన వారిని దున్నపోతుల్లా చూస్తున్నారని అర్థమొచ్చేలా ట్వీట్ చేశారు. అందుకే బీజేపీలో ఇతర పార్టీల నేతలు ఇమడలేకపోతున్నారన్నట్లుగా వ్యాఖ్యానించారు. దీంతో ఇది బీజేపీలో ఉన్న ఇతర నేతలకు గొంతులో వెలక్కాయ పడ్డట్లైంది. మరోవైపు ఈ ఒక్క ట్వీట్ తమకు అందొచ్చిన ఆయుధమని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
ఇటీవలి కాలంలో పలువురు నేతలు .. బీజేపీ హైకమాండ్ దగ్గరకు వెళ్తున్నారు. వచ్చిన తర్వాత అది చెప్పాం.. ఇది చెప్పాం.. హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూస్తాం.. అన్నట్లుగా మాట్లాడుతున్నారు. మరికొందరు నేతలైతే పార్టీలో ఉన్నట్లు ప్రవర్తించడం లేదు. ఇది సుదీర్ఘకాలంగా పార్టీని అంటిపెట్టుకుని. పార్టీ సిద్ధాంతాలను పాటిస్తూ ముందుకెళ్తున్న సీనియర్లకు చిరాకు తెెప్పిస్తోంది. ఆ ఆగ్రహంలోంచి వచ్చిన భావంగా మరికొందరు భావిస్తున్నారు. ఈ ఘటనతోనైనా హైకమాండ్ తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నారు.













