ప్రజల ఆత్మగౌరవానికి,… కేసీఆర్ అహంకారానికి మధ్య
మునుగోడు ఉప ఎన్నికతో టీఆర్ఎస్ నేతలు, శ్రేణులు భయపడుతున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ జడుసుకుంటోందని విమర్శించారు. టీఆర్ఎస్కు చెందిన మంత్రులు 86 మంది ఎమ్మెల్యేలు మునుగోడులో మకాం వేయాల్సి అవసరం ఏముందని నిలదీశారు. కులాలు, గ్రామాల వారీగా మద్యం, డబ్బులు పంచుతూ ప్రజాభిప్రాయాన్ని కూడగట్టుకొనే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రజల ఆత్మగౌరవానికి, కేసీఆర్ కుటుంబ అహంకారానికి మధ్య జరుగుతుందన్నారు.
కేసీఆర్ అసహనంతో మునుగోడులో లబ్ది పొందేందుకు కొత్త మండలంతో పాటు గిరిజన బంధు ప్రకటించారని మండిపడ్డారు. కుల వృత్తులపైన ఆధారపడిన బీసీ ఫెడరేషన్, కార్పొరేషన్లకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో తోక పార్టీలని విమర్శించిన కమ్యూనిస్టులతో కేసీఆర్ జట్టుకట్టారని దుయ్యబట్టారు. కేసీఆర్, కేటీఆర్ దత్తత తీసుకుంటే ఎక్కడైనా అభివృద్ధి జరుగుతుందా? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభివృద్ధి చేసేందుకు పనికిరారా? అని ద్వజమెత్తారు.













