ఎన్నికలకు ముందు వేర్వేరుగా పోటీ.. ఆ తర్వాత కలిసి
బీఆర్ఎస్తో కాంగ్రెస్ పార్టీ కలవాలని చూస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఫీల్డ్ నుంచి వెళ్లిపోయిందన్నారు. ఏ పార్టీ అయినా గెలుస్తామని చెబుతుందని, కాంగ్రెస్ నేతలు మాత్రం అందుకు విరుద్ధంగా ఓడిపోతామని చెబుతున్నారన్నారు. మోదీ నిజాయితీని చూసి ప్రజలు బీజేపీకి ఓటేస్తారని అన్నారు. రాష్ట్రంలోని 119 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఓటమి తప్పదని తెలిసినా ఆ పార్టీ నేతలు యాత్రలు ఎందుకు చేస్తున్నారని చురకలంటించారు. ఎన్నికలకు ముందు వేర్వేరుగా పోటీ చేసి ఆ తర్వాత కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనడం ప్రజలను మోసం చేయడమేనని మండిపడ్డారు.













