బీఏసీకి మాకు ఆహ్వానం అందలేదు : రఘునందన్
బీజేపీ ఎమ్మెల్యేలను బీఏసీ సమావేశానికి ఎందుకు పిలవడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రఘునందన్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్యేలను బీఏసీ సమావేశానికి పిలవకపోవడం ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇవ్వడమేనని వ్యాఖ్యానించారు. ఐదుగురు సభ్యులుంటేనే బీఏసీ సమావేశానికి పిలవాలని ఎక్కడ ఉందో సీఎం చెప్పాలన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు నెలకొన్నాయని, వాటిపైన చర్చించేందుకు శాసనసభ సమావేశాలను నెల రోజుల పాటు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నల్ల చొక్కాలు ధరించి నిరసన తెలుపుతామని పేర్కొన్నారు. ఇకపైనా నియంతృత్వ పోకడలను కేసీఆర్ మంగళం పాడి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని అన్నారు. టీఆర్ఎస్లో సీఎల్పీ విలీనమైనట్లు గెజిట్ జారీ చేసిన స్పీకర్ సీఎల్పీ నేతను ఎందుకు బీఏసీ సమావేశానికి ఆహ్వానించారని ప్రశ్నించారు.













