బీఆర్ఎస్ అభ్యర్థిని డిస్‌క్వాలిఫై చేయండి : రఘునందన్ రావు డిమాండ్

మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని వెంటనే డిస్‌క్వాలిఫై చేయాలంటూ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌ను కలిసి ఫిర్యాదు అందజేశారు. ఎన్నికల్లో ఓటర్లను మభ్య పెట్టడమే లక్ష్యంగా ఒక్కో ఓటర్‌కు రూ.500 చొప్పున వెంకట్రామిరెడ్డి డబ్బులు పంచారని రఘునందన్ రావు తన ఫిర్యాదులో ఆరోపించారు. దీనిపై ఇప్పటికే చాలాసార్లు పోలీసులకు కంప్లైంట్ చేశానని, ఎవరూ పట్టించుకోవడం లేదని ఈసీ వికాస్ రాజ్‌కు వివరించారు. ‘‘మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు మరో ఆరుగురు ఎమ్మెల్యేలు తమ ఫామ్‌హౌస్‌ల నుంచి వెంకట్రామిరెడ్డికి డబ్బులు పంపిణీ చేశారు. బూత్‌ల వారీగా లెక్కలు కట్టి ఎన్వలప్ కవర్ల ద్వారా గ్రామాలన్నింటిలో ఓటర్లకు డబ్బులు అందజేశారు. ఈ విషయంలో నేను చేసిన కంప్లైంట్లను కూడా పోలీసులు పట్టించుకోవడం లేదు. మెదక్ పోలీసుల తీరు చూస్తే తెలంగాణలో ఇంకా బీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉందని వాళ్లు భావిస్తున్నట్లుంది’’ అంటూ పోలీసుల తీరుపై కూడా రఘునందన్ రావు ధ్వజమెత్తారు. అంతేకాకుండా ఒకవేళ ఇక్కడ తనకు న్యాయం జరగకపోతే ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరించారు.