అవినీతి గురించి మాట్లాడితే అక్రమ కేసులు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ అవినీతి గురించి మాట్లాడితే అక్రమంగా కేసులు బనాయించి జైలులో పెడుతున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. చంచల్గూడ జైలులో ఉన్న తీన్మార్ మల్లన్నను ములాఖత్ ద్వారా కలిశారు. ఈ సందర్భంగా అర్వింద్ మీడియాతో మాట్లాడుతూ తీన్నార్ మల్లన్న జైలు నుంచి విడుదల కాగానే బీజేపీలోకి ఆహ్వానిస్తామని అన్నారు. పెట్టిన కేసులే మళ్లీ మళ్లీ పెట్టొదని హైకోర్టు చీవాట్లు పెట్టినా ప్రభుత్వం తీరు మార్చుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 37 రోజులుగా మారుమూల సెల్లో ఒక్కడినే ఉంచారని, అయినా మల్లన్న ఆత్మ విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. మల్లన్నను జైలులో మానసికంగా వేధిస్తున్నారన్నారు. జైలు అధికారులు తీవ్రవాదిలా చూస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్ అప్రజాస్వామికంగా నియంతల్లా వ్వవహరిస్తున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్కు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.













