వాళ్లందరికీ ఏ విధంగా న్యాయం చేస్తారు ? : బండి
ఆరు గ్యారంటీల అమలుకు దరఖాస్తుల స్వీకరణ షెడ్యూల్ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడాన్ని బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్వాగతించారు. మాజీ ప్రధాని వాజ్పేయీ జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో సుపరిపాలన దినోత్సవం నిర్వహించారు. అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డే అందుకు ప్రధాన అర్హతగా పేర్కొనడంపై ఆయన సందేహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గత పదేళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇప్పటికే 10 లక్షల కుటుంబాలు కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇంకా లక్షలాది కుటుంబాలు దరఖాస్తు చేసుకునేందుకు వేచి చూస్తున్నాయి. వాళ్లందరికీ ఏ విధంగా న్యాయం చేస్తారు? అని ప్రశ్నించారు. తక్షణమే క్తొత రేషన్ కార్డుల మంజూరుకు దరఖాస్తులకు ఆహ్వానించాలి. రాజకీయాలకు అతీతంగా నిజమైన లబ్ధిదారులను గుర్తించాలి. బీఆర్ఎస్ చేసిన అప్పుల గురించి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు. ఆ అప్పులను ఎలా తీరుస్తారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను ఎలా అమలు చేస్తారో ప్రజలకు వివరించాలి అని అన్నారు.













