ప్రధాని రాష్ట్రానికి వస్తే.. సీఎం కేసీఆర్ ఇదేనా మీ సంస్కారం
తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపోవడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. 80 వేల పుస్తకాలు చదివానన్న మీ జ్ఞానం ఏమైపోయింది, ఇదేనా మీ సంస్కారం అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. ప్రధాని రాష్ట్రానికి వచ్చినా రాలేనంత బిజీ షెడ్యూల్ ఏముందన్నారు. మీరు కోరినప్పుడల్లా ప్రధాని అపాయిట్మెంట్ ఇచ్చిన విషయాన్ని మర్చిపోయారా అని నిలదీశారు. రాష్ట్రానికి ప్రధాని వస్తే స్వాగతం పలకాలనే సోయి లేకుండా ఫాంహౌజ్‌కే పరిమితమవుతారా అని మండిపడ్డారు. కుంటిసాకులు చెబుతూ తప్పించుకోవడానికి మీకు సిగ్గన్పించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించకుండా దేశ ప్రధానిని అవమానించారని మండిపడ్డారు.













