2014కు ముందు రాష్ట్రంలో లేనట్లుగా…బీఆర్ఎస్ వచ్చిన తర్వాతే
ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు పరిపాలన సౌలభ్యం కోసం అప్పులు చేయొచ్చని అయితే, వాటిని సరైన రీతిలో వినియోగిస్తున్నామా? లేదా అన్నది పరిశీలించుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. విద్యుత్ రంగంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో శంకర్ మాట్లాడుతూ 2014కు ముందు రాష్ట్రంలో అసలు విద్యుత్ లేనట్లుగా, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే కరెంట్ వచ్చినట్లు జగదీశ్ రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. విద్యుత్ సంస్థల నష్టాలు చూస్తే ప్రజలు భయపడుతున్నారన్నారు. 24 గంటల నిరంతర విద్యుత్ ఇచ్చినట్లు గత ప్రభుత్వం అబద్ధం చెప్పింది. ఒక వైపు గత ప్రభుత్వం అప్పులు చేస్తే, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ అమలుకు సాధ్యం కాని హామీలిచ్చింది. శ్వేతపత్రంలో కేంద్ర ప్రభుత్వం చేసిన సాయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 200 యూనిట్ల చొప్పున 95 లక్షల కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇవ్వాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతోనే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి పెరిగిందన్నారు.
యాదాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి 15 రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చింది. కేంద్రం నుంచి సహాయం అందించలేదని జగదీశ్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చూస్తే జాలి కలుగుతోందని కాంగ్రెస్ సభ్యులు అంటున్నారు. ఇప్పుడే మీకు జాలి కలిగితే విచారణ ఎలా జరుపుతారు? 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను ఎప్పటినుంచి ఇస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలి. బొగ్గు నిల్వలు తగ్గిపోతున్నాయి. అందువల్ల సోలార్ విద్యుత్‌పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలన్నారు.













