అందుకు మేం సిద్ధమే : కిషన్ రెడ్డి

మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని, పేదల ఇళ్ల కూల్చివేతకు మాత్రమే వ్యతిరేకమని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మూసీ సుందరీకరణ-పునరుజ్జీవం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లను కూల్చుతున్న తీరును వ్యతిరేకిస్తూ మూసీ బాధితులకు అండగా నిలిచి వారికి భరోసా కల్పించేందుకు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ చేపట్టిన మహాధర్నాలో కిషన్ రెడ్డి మాట్లాడారు. పేదల ఇళ్లను కూల్చే దుర్మార్గపు ఆలోచనను సీఎం రేవంత్ రెడ్డి విరమించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నాం. మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదల ప్రజల ఇళ్లల్లో ఉండేందుకు మేం సిద్ధమే అన్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించాలని డిమాండ్ చేశారు. ప్రజల కనీస సౌకర్యాలు ముఖ్యమా, రూ.లక్షల కోట్లు అప్పు చేసి మూసీ సుందరీకరణ ముఖ్యమో సీఎం తేల్చుకోవాలన్నారు. మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ కట్టాలని సూచించారు.