ఆ జీవోను సవరించే వరకు బదిలీలు ఆపాలి
తెలంగాణ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. జీవో 317ను సవరించాలని కోరుతూ గవర్నర్కు బీజేపీ నేతలు వినతిపత్రం అందజేశారు. అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడుతూ హడావుడిగా విడుదల చేసిన జీవోను సవరించాలని గవర్నర్ను కోరామన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగుల ఇబ్బందులను గవర్నర్కు వివరించామని తెలిపారు. మరొకసారి సకల జనుల సమ్మె జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఉద్యోగుల బదిలీలాల్లో తీవ్రమైన అవినీతి చోటుచేసుకుందని ఆరోపణలు ఉన్నాయన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులకు బీజేపీ వ్యతిరేకం కాదని తేల్చి చెప్పారు. ఉద్యోగులను హింసించిన పాపం కేసీఆర్కు తగిలి తీరుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులను పిలిచి చర్చించే వరకు బదిలీల ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చి 40 నెలలు దాటినా తెలంగాణ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని విమర్శించారు. ఉపాధ్యాయ, ఉద్యోగులను సంప్రదించకుండా 317జీవోను తీసుకొచ్చారన్నారు. ప్రభుత్వం దగరున్న సీనియారిటీ లిస్ట్ అంతా తప్పుల తడకే అని అరోపించారు. 317 జీవోను సవరించే వరకు ఉద్యోగులకు బీజేపీ అండగా ఉంటుందని అన్నారు.













