ఒకరు కొట్టినట్లు.. ఇంకొకరు ఏడ్చినట్లు
టీఆర్ఎస్, ఎంఐఎం నేతలు హైదరాబాద్ ప్రజల చెవుల్లో క్యాలిఫ్లవర్స్ పెడుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఎద్దేవా చేశారు. ఆమె బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు. ఒకరు కొట్టినట్లు.. ఇంకొరు ఏడ్చినట్లు చేస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎంఐఎం నేతలు హిందువులను హేళన చేసినప్పుడు కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ఆమె ప్రశ్నించారు. ఎంఐఎంకు మేయర్ సీటు అప్పగించడానికి కేసీఆర్ సిద్ధమయ్యారు. వంద సీట్లు వస్తాయన్న కేసీఆర్.. ఇప్పుడు 25 సీట్లు గెలిచినా మేయర్ సీటు టీఆర్ఎస్దే అంటున్నారని ఆరోపించారు.
ఎంఐఎం, పాతబస్తీని ఎందుకు అభివృద్ధి చేయలేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎందుకు ఇవ్వలేదు. కొత్త సీసాలో పాత సారా అన్నట్టుగా టీఆర్ఎస్ మ్యానిఫెస్టో ఉందని ఆరోపించారు. అభివృద్ధి చేస్తే వరద నీరు ఇళ్లలోకి ఎలా వచ్చింది? తెలంగాణ రాష్ట్రంలో ఆరాచక పాలన కొనసాగుతోంది. నా పార్టీ, నా నగరం, నా పాలన అనే నినాదం టీఆర్ఎస్కు సరిగ్గా సరిపోతుందన్నారు. వగల ముచ్చట్లు చెప్పి 2016లో గెలిచారని, టీఆర్ఎస్కు ఓటు వేస్తే.. ఒక కుటుంబానికి వేసినట్లే. హైటెక్ షో పీస్‌లా కేటీఆర్ మారిపోయారని డీకే అరుణ ఎద్దేవా చేశారు.













