ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు పోరాటం ఆగదు : బీజేపీ నేత లక్ష్మణ్
ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు బీజేపీ నేతలను నిర్బంధిస్తున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్ని నిర్బంధాలు, కేసులు పెట్టినా వాటిని ఎదుర్కొంటూనే పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగులు, నిరుద్యోగులకు భరోసా కల్పించడానికే జాతీయ నేతలు రాష్ట్రానికి వస్తున్నారని తెలిపారు. జీవో సవరించాలని వరంగల్లో నిరసన చేపడుతున్నామని, ఇందులో అసోం సీఎం పాల్గొంటారని తెలిపారు. కోవిడ్ నిబంధనలకు లోబడే జిల్లాల్లో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జీవోపై వెనక్కి తగ్గపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ముల్కీ నిబంధనలతో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం, 317 జీవో కారణంగా అవే పరిస్థితులు స్వరాష్ట్రంలో వస్తున్నాయన్నారు. అశాస్త్రీయంగా జిల్లాల విభన చేశారని విమర్శించారు. 10 జిల్లాలు 33 జిల్లాలుగా చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని ఆరోపించారు. ఆ రాజకీయ కారణాలే ఇప్పుడు ఉద్యోగులకు శాపం అయిందని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నాలుగు గోడల మధ్య కూర్చొని బదిలీలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు శ్రీకృష్ణ కమిటీ అందరి అభిప్రాయాలు తీసుకుంటే, సొంత రాష్ట్రం సీఎం ఎవరినీ సంప్రదించలేదని గుర్తు చేశారు. నాడు స్థానిక అంశంపై పోరాటం చేస్తే… ఇపుడూ అదే పోరాటం చేయాల్సి వస్తోందన్నారు.













