బీజేపీ మరో కీలక నిర్ణయం… బండి సంజయ్ కి
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ వేగవంతం చేసింది. సీట్ల కేటాయింపు పూర్తి కాకముందే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌కు హెలికాప్టర్‌ను సమకూర్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో సూడిగాలి పర్యటన కోసం హెలికాప్టర్‌ను ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీని కోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర పార్టీకి ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బండికి ప్రత్యేక హెలికాప్టర్‌ను బీజేపీ అధిష్ఠానం కేటాయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సూర్యాపేట సభలో బీజేపీ అగ్రనేత అధికారంలోకి వస్తే బీసీ నేతనే సీఎంగా చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో బండి సంజయ్‌కు హెలికాప్టర్ ను సమకూర్చడం ఇప్పుడు బీజేపీలో చర్చకు దారితీసింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోకి బండి దిగుతుండడంతో బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్టార్ క్యాంపెయినర్ హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని బండిని పార్టీ అధిష్ఠానం ఆదేశించినట్లు తెలిసింది. ప్రతి రోజు రెండు బహిరంగ సభల్లో బండి సంజయ్ పాల్గొనేలా బీజేపీ ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల బహిరంగ సభ కమిటీ చైర్మన్ గా బండి కొనసాగుతున్నారు.













