ఈ విషయం బీజేపీకి అర్థం కాదు : ఒవైసీ
తెలంగాణ రాష్ట్రంలో మతాన్ని ఆధారంగా చేసుకుని ముస్లింలు రిజర్వేషన్లు పొందడం లేదు అని హైదరాబాద్ ఎంపీ అసుదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రిపోర్టుల ఆధారంగానే ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారని తెలిపారు. ఈ విషయం బీజేపీకి అర్థం కాదు. ముస్లింలను కనుమరుగు చేసేందుకు బీజేపీ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో బీజేపీ పాలనా కొనసాగుతోందన్నారు. మన యువత నిరుద్యోగులుగా ఉన్నారు, చైనాతో సరిహద్దు సమస్యలు ఉన్నాయి. ఇన్ని సమస్యలు పెట్టుకుని, వీటిపై హోంమంత్రి అమిత్ షా మాట్లాడరు. కానీ ముస్లింలు ఈ సామాజానికి ముప్పు అని మాత్రం అమిత్ షా మాట్లాడుతారని, అది సరికాదని అన్నారు.
హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఒవైసీ, ఒవైసీ అనే ఏడుపు ఇంకెంత కాలం? అని ప్రశ్నించారు. ఇకనైనా అలాంటి వ్యాఖ్యలు ఆపి ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గురించి మాట్లాడాలని సూచించారు. ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం తప్ప తెలంగాణపై బీజేపీకి ఎలాంటి విజన్ లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీలకు న్యాయం చేయడంపై మీకు నిజంగా చిత్తశుద్ది ఉంటే 50 శాతం సీలింగ్ కోటాను తొలగించేందుకు రాజ్యాంగ సవరణ తీసుకురావాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు స్టే కింద కొనసాగుతున్నాయి. ఒక వేళ ఈ విషయం మీకు తెలియకపోతే సుధీర కమిషన్ నివేదికను పూర్తి చదవాలి అని తెలిపారు.













