ఢిల్లీలో కాదు.. తెలంగాణలో ఉన్న ప్రగతిభవన్ ముందు
తెలంగాణ రాష్ట్రంలో మహిళలు అభద్రతా భావంతో ఉన్నారని, వారు బయటకు వస్తే తిరిగి ఇంటికి వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళా గోస-బీజేపీ భరోసా దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారశైలే కారణమని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అత్యాచారాల వార్తలే వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నేత వేధింపుల వల్ల ఒక కుటుంబం ఆత్మహత్యచేసుకుంది. ఎన్సీఆర్బీ రికార్డుల మేరకు తెలంగాణలో మహిళలపై అత్యాచారాలు 17 శాతం పెరిగాయి. అన్ని విషయాల్లో తెలంగాణ మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ మహిళలే కాకుండా మహిళా ప్రజాప్రతినిధులకు కూడా రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది.
ఎన్డీయే ప్రభుత్వం మూడు సార్లు పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడితే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. ఈ విషయాన్ని ప్రతిఒక్కరు గమనించాలి. తెలంగాణ కేబినెట్లో 3 శాతం కూడా మహిళా మంత్రులు లేరు. మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలంటూ ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో ధర్నాకు దిగారు. ఇలాంటి పరిస్థితుల్లో కవిత, ముందు సీఎం కేసీఆర్ను ప్రశ్నించాలి. ఢిల్లీలో కాదు.. తెలంగాణలో ఉన్న ప్రగతిభవన్ ముందు ధర్నా చేయాలి. అప్పుడే ప్రజలు గుర్తించేందుకు అవకాశం ఉంటుంది అని అన్నారు.













