అధికారిక కార్యక్రమంలో.. రాజకీయ విమర్శలు ఎలా?
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో సీఎం కేసీఆర్ రాజకీయ విమర్శలు ఎలా చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. హుజూరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారిక కార్యక్రమంలో సీఎం కేసీఆర్ కేంద్రం, ప్రధానిపై రాజకీయ విమర్శలు చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడటం మానుకోవాలన్నారు. కేసీఆర్ అభివృద్ధి చేశానని అనుకుంటే ఏ జిల్లాకు పోతే అక్కడ ఏం చేశారో సీఎం చెప్పాలన్నారు. ఎంత మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మిషన్ భగీరథ నీళ్లు పంపిస్తే సీఎం కేసీఆర్‌కు తాగే దమ్ముందా అని నిలదీశారు. దక్షిణ తెలంగాణ జిల్లాలను ఏడారిగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. మేం అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే సీఎం కేసీఆర్ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవాలని ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా కోర్టులో న్యాయం జరిగిందన్నారు. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు తెలిపారు.













