కాంగ్రెస్‌లోనే బీఆర్ఎస్ విలీనం.. కేసీఆర్‌కు ఏఐసీసీ పదవి : కేంద్ర మంత్రి బండి సంజయ్

త్వరలోనే బీఆర్‌ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని కేంద్రమంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా కేసీఆర్‌కు ఏఐసీసీ, కేటీఆర్‌కు పీసీసీ, కవితకు రాజ్యసభ సీటు వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఇటీవల బీఆర్ఎస్ గురించి మాట్లాడిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఆ పార్టీ త్వరలోనే బీజేపీలో విలీనం అవుతుందని, కవితకు బెయిల్ వస్తుందని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గానే బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీలో విలీనం చేస్తేనే ఆ పార్టీ నేత మనీశ్ సిసోడియాకు బెయిల్ వచ్చిందా? అని బండి సంజయ్ నిలదీశారు. సీఎం పదవిలో ఉన్న వ్యక్తి ఇలా రాజకీయ లబ్ధి కోసం గౌరవ న్యాయస్థానాలపై బురద జల్లడం, కోర్టుల ప్రతిష్ఠను దిగజార్చడం ఏమాత్రం సరికాదని హితబోధ చేశారు. బీజేపీని బద్నాం చేసేందుకు కాంగ్రెస్ నేతలు ఇలా దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలపై విమర్శలు గుప్పించిన ఆయన.. పొత్తు పెట్టుకొని పదవులు పంచుకున్న చరిత్ర కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకే ఉందని గుర్తు చేశారు. ఇందులో బీజేపీకి ఏం సంబంధం ఉందో చెప్పాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌ను విలీనం చేస్తే బెయిల్ వస్తుందనడం మూర్ఖత్వమని, కవిత బెయిల్ విషయంలో కావాలనే బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కేసీఆర్, కేటీఆర్‌లను ఇప్పటి వరకు రేవంత్ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు.