22 నుంచి బయో ఏషియా సదస్సు
జీవశాస్త్ర రంగంలో ఆసియా ఖండంలోనే అతి పెద్దదిగా పేరొందిన బయో ఏషియా సదస్సు ఈసారి కరోనా, ఆరోగ్యం ప్రధాన ఎజెండాలుగా సాగనున్నది. 18వ ఎడిషన్ బయో ఏషియా సదస్సు ఈ నెల 22, 23 తేదీల్లో హైదరాబాద్‌లో జరుగనున్నది. కరోనా నేపథ్యంలో తొలిసారిగా వర్చువల్‌గా సదస్సు జరుగుతుంది. ఇందులో ప్రధానంగా కొవిడ్-19, ప్రపంచవ్యాప్తంగా జీవశాస్త్ర రంగంలో అది తీసుకొచ్చిన మార్పులపై చర్చిస్తారు. ఈ సమావేశం ఫార్మా, బయోటెక్ కంపెనీలు సీఆర్వోలు, సీఎంవోలు, సీడీఎంవోలు, బయోటెక్ స్టార్టప్‌లు, అకడమిక్ ఇన్స్టిట్యూషన్లు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, రాజకీయ నేతలు, నిపుణులకు మంచి అవకాశం.
జీవశాస్త్ర రంగంలో మార్పులు, టీకాల ఉత్పత్తిలో భారత్ పాత్ర, కొవిడ్-19 నేర్పిన పాఠాలు, డిజిటల్ హెల్త్, ఫార్మా, వైద్య పరికరాల రంగంలో వస్తున్న మార్పులు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించేందుకు బయోఏషియా చక్కని వేదిక అని బయోఏషియా సీఈవో శక్తి నాగప్పన్ అన్నారు. ఈ సారి పరిస్థితులను అధిగమిద్దాం (మూవ్ ద నీడిల్) థీమ్‌తో గత సదస్సుల కన్నా భారీగా నిర్వహించనున్నట్టు చెప్పారు.













