విజయవంతంగా ముగిసిన బయో ఏషియా 2020 సదస్సు
రానున్న రోజుల్లో దేశానికి అవసరమైన వైద్యపరికరాలు హైదరాబాద్‌లో తయారవుతాయని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. దేశంలోనే అతి పెద్దదైన సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్క్‌లో ఇప్పటికే 20 కంపెనీలకు భూకేటాయింపులు జరిపామన్నారు. వచ్చే జులై నుంచి ఆరు కంపెనీలు తమ వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాయని పేర్కొన్నారు. మూడురోజుల పాటు హైదరాబాద్‌లో నిర్వహించిన బయో ఏషియా 2020 సదస్సు దిగ్విజయంగా ముగిసింది. ముగింపు సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొని సదస్సు విజయవంతంకాడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. వివిధ దేశాల ప్రతినిధులు, కంపెనీల సీఈవోలు హాజరై అనేక అంశాలపై సదస్సులో చర్చించారన్నారు. ప్రస్తుతం 80 శాతం మేర దిగుమతి చేసుకొంటున్న వైద్య పరికరాలను ఇక్కడే తయారుచేయడం ద్వారా వాటి వ్యయం తగ్గటమే కాకుండా, రోగులకు తక్కువ ఖర్చుతో చికిత్సలు అందించవచ్చని చెప్పారు.
ఆసియాలో అతిపెద్ద స్టెంట్ల యూనిట్ అయిన సహజానంద్ టెక్నాలజీ డిసెంబర్ నాటికి వాణిజ్య కర్యకలాపాలు ప్రారంభించడానికి సిద్ధమైందని తెలిపారు. పార్కుకు కేటాయించిన 276 ఎకరాల్లో భూ కేటాయింపులు దాదాపుగా పూర్తయ్యాయని, దీంతో పార్క్‌కు మరికొంత స్థలాన్ని కేటాయించనున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మేకిన్ ఇండియా నినాదం ఇప్పటికే ఇచ్చిందని, తెలంగాణ, ఒడిశా వంటి రాష్ట్రాలు ఉత్పాదకతను పెంచుకోవడానికి కృషి చేస్తున్నాయని అన్నారు. సదస్సులో పాల్గొన్న ప్రముఖులతో భేటీ కావడం తనకు లభించిన ప్రత్యేక అవకాశంగా భావిస్తున్నానని పేర్కొరన్నారు. సదస్సుకు హాజరైనవారందరికీ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ ఏడాది సదస్సుకు 35 దేశాల ప్రతినిధులు హాజరయ్యారని, 2021 సదస్సు ఇంతకంటే పెద్దదిగా విస్త•తంగా జరుగుతుందన్న ధీమా వ్యక్తం చేశారు. సదస్సును విజయవంతంగా నిర్వహించిన బయో ఏషియా సీఈవో శక్తినాగప్పన్తో పాటు ఆయన బృందాన్ని అభినందించారు. ఒడిశా మంత్రి అశోక్ చంద్రపాండ మాట్లాడుతూ ఒడిశాలోనూ లైఫ్సైన్సెస్సకు మంచి పెట్టుబడి అవకాశాలున్నాయన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీపీ ఆచార్య, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నరసింహారెడ్డి, బయోఏషియా సీఈవో శక్తి నాగప్పన్ పాల్గొన్నారు.













