గద్వాల ఎమ్మెల్యేకు సుప్రీంకోర్టులో ఊరట
బీఆర్ఎస్కు చెందిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఊరట లభించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎన్నికల సంఘం, ప్రతివాదులకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల నోటీఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు గెజిట్ విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో తన వాదనలు కూడా వినాలని డీకే అరుణ సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే బ్యాంకు ఖాతాలు వెల్లడించకపోవడం తప్పేనని కృష్ణమోహన్ రెడ్డి న్యాయవాది అంగీకరించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.













