మీకు అవమానం జరిగితే తెలంగాణకు జరిగినట్టా ? : భట్టి
ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అతలాకుతం చేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అవినీతిని ఊడ్చేస్తామని చీపురు గుర్తుతో ఆమ్ ఆద్మీ పార్టీ ఢల్లీిలో అధికారంలోకి వచ్చిందన్న భట్టి, ఆ పార్టీ పాలనలోనే ఇంత పెద్ద కుంభకోణం జరగడం దారుణమన్నారు. దేశంలో ఏ పార్టీ చేయలేనంత అవినీతి కేజ్రీవాల్ చేశారని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయన్నారు. లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన మనీశ్ సిసోడియా డిప్యూటీ సీఎం పదవికి ఒక్కడే రాజీనామా చేయడం కాదని, ఈ వ్యహారం మొత్తానికి బాధ్యత వహిస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసు ఇస్తే తెలంగాణ ప్రజలకు ఏం సంబంధమని ప్రశ్నించారు. ఇది అందరికీ అనమానం అన్న కోణంలో ఎందుకు చిత్రీకరిస్తున్నరని బీఆర్ఎస్ నేతలపై ఆయన మండిపడ్డారు. ఈ నెల 16వ తేదీన తన పాదయాత్ర మొదలవుతుందని తెలిపారు. పాదయాత్రకు ఇంకా రూట్‌మ్యాప్ సిద్ధం కాలేదని తర్వాత పూర్తి వివరాలు చెబుతానని తెలిపారు. అంతకు ముందు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి కూడా నోటీసులిచ్చారు. వాళ్లది లిక్కర్ స్కామ్ కాదు. వ్యక్తిగత దోపిడీ చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. వారికి సీబీఐ, ఈడీ క్లిన్చీట్ ఇచ్చిందన్నారు.













