అందుకే సీఎం కేసీఆర్ గజ్వేల్ ను వదిలి…. కామారెడ్డికి : భట్టి విక్రమార్క
ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ మధిర సభ పూర్తవగానే మీడియాతో మాట్లాడిన భట్టి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో 78 సీట్లకు పైబడి కాంగ్రెస్ అభ్యర్థులు గెలవబోతున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ కావాలా? కరెంట్ కావాలా? అని మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ ఉన్నందువల్లే కరెంట్ ఉందన్నారు. 2014 కంటే ముందు అనేక ప్రాజెక్టులను కాంగ్రెస్ డిజైన్ చేసిందని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో సోనియా గాంధీ తెలంగాణకు నాలుగు శాతం ఎక్స్ట్రా పవర్ కేటాయించారని గుర్తు చేశారు. రాయి ఏదో రత్నం ఏదో తెలంగాణ ప్రజలకు తెలుసని, ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ను బండకేసి బాధడానికి తెలంగాణ ప్రజలు సిద్ధమయ్యారని స్పష్టం చేశారు. గెలవలేననే భయంతోనే కేసీఆర్ గజ్వేల్ వదిలి కామారెడ్డి దాకా పారిపోయాడాని ఎద్దేవా చేశారు. కేసీఆర్ లాగా తాను ఫామ్‌హౌజ్‌లో పడుకోలేదని, రాష్ట్ర ప్రజల తరపున పోరాడుతూనే మధిర నియోజకవర్గ సమస్యలపై గళమెత్తానన్నారు.













