డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ

అన్ని రకాల వసతులున్న హైదరాబాద్‌లో పరిశ్రమలను స్థాపించాలని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గ్యారెట్ విన్ ఓవెన్‌ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు. అందుకు ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ప్రజాభవన్‌లో భట్టితో గ్యారెట్ విన్ ఓవెన్, బ్రిటిష్ హైకమిషన్‌లోని రాజకీయ, ఆర్థిక సలహాదారు నళినీ రఘురామన్‌లు భేటీ అయ్యారు. మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎనర్జీ, పట్టణాభివృద్ధి, స్కిల్ డెవలప్‌మెంట్ వంటి అంశాలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ స్వర్గధామమన్నారు. ఇక్కడ అందరికీ అనుకూలమైన వాతావరణం, తక్కువ వేతనాలకే అందుబాటులో మావన వనరులు, అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్తు సరఫరా, తాగునీటి సరఫరా వంటి సదుపాయాలున్నాయని వివరించారు. వీటికి తోడు రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధికి కార్యాచరణను చేపడుతున్నామని తెలిపారు.