జపాన్ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి భట్టి… 2030 నాటికి

తెలంగాణలో 2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. జపాన్ పర్యటనలో ఉన్న ఆయన అధికారులతో కలిసి క్యోటో నగరానికి సమీపంలోని ప్రముఖ సెమీకండక్టర్ల పరిశ్రమ రోప్మ్‌ాను సందర్శించి ఆ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భిన్న రంగాల్లో సెమీకండక్టర్ల ఆవశ్యకత ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు కల్పిస్తున్న అవకాశాలను దృష్టిలో ఉంచుకొని విడిగా లేదా ఉమ్మడి భాగస్వామ్యంతో తెలంగాణలో సెమీకండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు కల్పిస్తున్న సౌకర్యాలు వ్యాపార అభివృద్ధికి అనుకూలంగా ఉన్నందున రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం భట్టి, అధికారులు పానసోనిక్ కంపెనీ కార్యాలయాన్ని సందర్శించారు. కంపెనీ ప్రెసిడెంట్ నబి నకానీషితో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల గురించి వారికి వివరించారు. తెలంగాణలో పానసోనిక్ కంపెనీ ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) ప్లాంట్ ఏర్పాటు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని వారికి భట్టి హామీ ఇచ్చారు.