తెలంగాణలో మరో కొత్త పార్టీ?
రాష్ట్రంలో బీసీలే ప్రధాన ఎజెండాగా కొత్త పార్టీ కోసం మంతనాలు జరుగుతున్నాయి. వారం రోజులుగా బీసీ, కులసంఘాలతో నగరంలోని హోటళ్లలో రహస్యంగా భేటీలు, నాలుగు రోజులుగా ఆర్.కృష్ణయ్య నివాసంలో బీసీ వర్గాలు, అధికారులు, మాజీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. 2014లో ఉద్యమవేడి ఉన్న క్రమంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్ సైతం ప్రభుత్వ వ్యతిరేకతను ప్రచారం చేసి లబ్ధి పొందే పరిస్థితి లేదనే అభిప్రాయాలున్నాయి. కాంగ్రెస్‌కు టీఆర్ఎస్కు సంపూర్ణ మెజారిటీ వచ్చే అవకాశాలు లేని క్రమంలో బీసీలకు ప్రత్యేక పార్టీ పెట్టి, పోటీచేసి ఎమ్మెల్యేల సంఖ్యను సింగిల్ డిజిట్ దాటించగలిగితే ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించవచ్చని బీసీ నాయకుడు ఒకరు తెలిపారు. బీసీల కోసం పార్టీ పెట్టాలన్న ఒత్తిడి వస్తున్న క్రమంలో తెలంగాణకే పరిమితం కావాలా? ఏపీలోనూ ఏర్పాటు చేయాలా? అనే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్, బీజీపీ తమ పార్టీలోకి రావాలని కృష్ణయ్యను ఆహ్వానిస్తున్నాయి.













