మీ దయ ఉంటే మరోసారి.. లేకపోతే ఇంట్లో : మంత్రి కేటీఆర్
బీసీ బంధు పథకం కొంతమందికే పరిమితం కాదని, రాష్ట్రంలో ఉన్న అర్హులందరికీ ప్రభుత్వ సాయం అందుతుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీసీ బంధు పథకం కింద 600 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బీసీ బంధు కింద ఇచ్చే ఆర్థిక సాయం మళ్లీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇలాంటి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో అర్హులకు 800 పట్టాలు అందిస్తున్నాం. దాంతో పాటు సొంత స్థలం ఉన్న వారికి గృహలక్ష్మి పథకం కింద ఒక్కొక్కరికి రూ.3 లక్షలు ఇస్తున్నాం. ప్రతి నియోజకవర్గానికి 3 వేల మంది చొప్పున అర్హులను ఎంపిక చేస్తాం. వారందరికీ న్యాయం చేస్తాం. 50 ఏళ్లు అధికారం ఇచ్చినా ఏమీ చేయని వారి మాటలు పట్టించుకోవద్దు. వాళ్లు ఏం చేసినా మేం పట్టించుకోవాలనుకోవడం లేదన్నారు.
అయితే వారు మీ దగ్గరకు వస్తే ఒకటే అడగండి. మీ హయాంలో రూ.200 మాత్రమే పింఛను ఎందుకిచ్చారని ప్రశ్నించండి. నీరెందుకు ఇవ్వలేదని నిలదీయండి. ప్రజలు చైతన్యం ప్రదర్శించాలి. పని చేసే ప్రభుత్వాలు, నాయకులను ప్రజలు కాపాడుకోవాలి. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ప్రజలు ఆగం కావొద్దు. నేను ఇంతవరకు మద్యం, డబ్బులు పంచలేదు. ఇకపై కూడా పంచను. మీ దయ ఉంటే మరోసారి గెలుస్తా. లేకపోతే ఇంట్లో కూర్చుంటా. ఇప్పుడు ఉన్న విధంగానే భవిష్యత్తులో కూడా ప్రజలకు సేవ చేస్తా. కులం, మతం అనే పిచ్చి లేకుండా అవసరమైన పని చేసే బాధ్యత నాది. అందరికీ అండగా ఉంటా అని అన్నారు.













