ఈ నెల 20 నుంచి బతుకమ్మ ఉత్సవాలు
బతుకమ్మ పండుగకు రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్సీసింగ్ ఆదేశించారు. ఈ నెల 20న ప్రారంభమయ్యే బతుకమ్మ పండుగ 28 వరకు తొమ్మిది రోజుల పాటు జరుగుతుందని, ఏర్పాట్లలో ఇబ్బందులురాకుండా సమన్వయంతో పనిచేసి రాష్ట్ర సాంస్కృతిక ఉత్సవాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని కోరారు. సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 26న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ ఉత్సవాన్ని 35వేల మందితో పెద్దఎత్తున నిర్వహించాలని నిర్ణయించినందున భారీగా ఏర్పాట్లు చేయాలని ఆధికారులను ఆదేశించారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా 28న వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మహిళలు బతుకమ్మలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేస్తారని, ట్యాంక్‌బండ్‌పై ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. బతుకమ్మ పండుగ ఏర్పాట్ల ఖర్చులకు 18వ తేదీలోగా జిల్లాలకు నిధులు అందజేస్తామన్నారు. 20వ తేదీలోపు బతుకమ్మ చీరెల పంపిణీ పూర్తికావాలని ఆధికారులకు సృష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ పండుగ నిర్వహణ ఏర్పాట్లపై రెండురోజుల్లో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని తెలిపారు.













