తెలంగాణలో ‘బార్లా’ తెరచుకోనున్నాయి…
దాదాపు 160రోజుల తర్వాత తెలంగాణలోని మందుబాబులకు మరింత కిక్ ఇచ్చే వార్త ఇది. దేశవ్యాప్తంగా బార్ అండ్ రెస్టారెంట్లు తెరుచుకునేందుకు కేంద్రం ఆయా రాష్ట్రాలకే అధికారం ఇచ్చేసిన నేపధ్యంలో ఒక్కో రాష్ట్రం తమ ప్రధాన ఆదాయ వనరులను కాపాడుకునే ప్రయత్నాల్లో భాగంగా తలుపులు బార్లా తెరుస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పటికే కర్ణాటక వంటి రాష్ట్రాలు పబ్స్, బార్లకు గేట్లెత్తేశాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా బార్లు ప్రారంభం కానున్నాయి.
సెప్టెంబరు 7వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా బార్లు తెరిచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అయితే బార్లలో కస్టమర్ల సంఖ్య తగ్గింపు, సోషల్ డిస్టెన్స్ పాటించడం, థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్.. వగైరాలు ఖచ్చితంగా ఉండాలని బార్ల, పబ్స్ యాజమాన్యాలకు ఇప్పటికే నిబంధనల జాబితా అందించినట్టు సమాచారం. లాక్ డవున్కి పూర్వం దేశంలోనే ఎక్సైజ్ ఆదాయంలో తెలంగాణ టాప్లో ఉన్న సంగతి తెలిసిందే. పలు పధకాల అమలుకు గడ్డుకాలం దాపురించి, ఇప్పటికే కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయిన పరిస్థితిలో మళ్లీ తన ప్రధాన ఆదాయ వనరును తోడు చేసుకోవాలి కాబట్టి… తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు.













