ఏప్రిల్ 14 నుంచి ప్రజా సంగ్రామ యాత్ర : బండి సంజయ్
ఏప్రిల్ 14 అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. సంస్థాగతంగా బీజేపీని బలోపేతం చేయడం, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై మ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల జోనల్ స్థాయి సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీకి ఉనికి లేదని, సీఎం కేసీఆర్ జనగామ సభలో అన్నారని, అందుకే మార్చి నెలాఖరులో జనగామలోనే భారీ బహిరంగ సభ నిర్వహించి సత్తా చూపిస్తామని అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల సంఘానికి సమర్పించిన తప్పుడు ఆఫిడవిట్‌పై ఫిర్యాదు చేసిన వారిని పోలీసులే కిడ్నాప్ చేయడం అత్యంత దారుణమన్నారు. తప్పుడు అఫిడవిట్‌పై ఎన్నికల కమిషన్ విచారణ ముగిసే వరకు ఆరుగురు ఫిర్యాదుదారులను జైల్లో పెట్టడమే లక్ష్యంగా కేసులు నమోదు చేశారన్నారు.
బీజేపీ ఇలాంటి దారుణాలను అడ్డుకుని తీరుతుందన్నారు. మంత్రి రాజీనామా చేసేంత వరకు పార్టీ పరంగా ఆందోళనను కొనసాగిస్తామన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర మంత్రులతోపాటు టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలపై అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఉద్యమిస్తామన్నారు. అందరం కలిసి ప్రజాస్వామిక తెలంగాణను ఏర్పాటు చేసే దిశగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.













