మా సహనాన్ని పరీక్షించొద్దు.. టీఆర్ఎస్కు బండి సంజయ్ వార్నింగ్
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ శ్రేణులు దాడులు చేశాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రమంతటా ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. అయితే తాజాగా దీనిపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. తమ సహనాన్ని టీఆర్ఎస్ చేతకానితనంగా చూస్తోందని, తమ సహనాన్ని పరీక్షించొద్దంటూ బండి తీవ్రంగా స్పందించారు. తాము ఎంతో సంయమనం పాటిస్తున్నా తమను రెచ్యగొట్టే చేష్టలు చేస్తున్నారంటూ టీఆర్ఎస్పై మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలు రంగంలోకి దిగితే టీఆర్ఎస్ తట్టుకోలేదంటూ అధికార పార్టీ నేతలను స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేక దాడులకు పాల్పడుతున్నారని, ప్రశ్నించ గళాన్ని నొక్కేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులు చేయడం, ఇళ్లపైకి వెళ్ళి రౌడీయిజం చేయడం చేతకాని తనమని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ పార్టీ గూండాలకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని, ఆ రోజులు మరెంతో దూరంలో లేవని, టీఆర్ఎస్ రౌడీ పాలనకు చరమగీతం పాడే రోజులు అతి చేరువలో ఉన్నాయని అన్నారు. ఇదే విషయంపై బీజేపీ మహిళా నేత డీకే అరుణ కూడా ఘాటుగా స్పందించారు. ఎంపీ కుటుంబానికి టీఆర్ఎస్ నుంచి, ఆ పార్టీ గూండాల నుంచి ప్రాణహాని ఉందని, అర్వింద్ ఇంట్లో లేరని తెలిసి కూడా కావాలనే కుటుంబాన్ని భయబ్రాంతులకు గురిచేసేందుకు దాడులు చేశారని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా దాడులకు ప్రధాన కారణమైన ఎమ్మెల్సీ కవితపై వెంటనే కేసు నమోదు చేయాలని, బీజేపీ నేతలు చిన్న ధర్నా చేసినా కేసులు పెట్టే పోలీసులు ఇంత జరుగుతున్నా ఏం చేస్తున్నారని, ఇప్పటికైనా టీఆర్ఎస్ గూండాలపై కేసులు నమోదు చేస్తారా అంటూ ప్రశ్నించారు.













