రజకార్ల పాలనలో, బ్రిటీష్ పాలనలో కూడా.. ఇలాంటి
గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ పేరుతో అర్ధరాత్రి పోలీసులు పేదల పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రజకార్ల పాలనలో, బ్రిటీష్ పాలనలో కూడా ఇట్లాంటి అరాచకాలు చూడలేదేమో అని అన్నారు. చిన్నా పెద్దా, మహిళలనే తేడా లేకుండా దౌర్జన్యం చేసి కాళ్లు చేతులు విరగొట్టడం, తలలు పగలకొట్టడం దారుణమన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా నిర్వాసితులను ఆదుకోకుండా ఏళ్ల తరబడి సమస్యను నాన్చూతూ కాలయాపన చేయడం అన్యాయమని అన్నారు. ఉన్నట్లుండి అర్దరాత్రి అకస్మాత్తుగా దాడులు చేయడం ఆటవికమని మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ ఫాంహౌజ్ నుండి పాలించడం మానుకోవాలని హితవు పలికారు. మహిళల పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించడం దుర్మార్గమన్నారు. అసలు అర్ధరాత్రి వెళ్లి దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏమిటో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు పూర్తిగా ఆదుకున్న తరువాత ప్రాజెక్ట్ పనులు ప్రారంభించాలని, అప్పటి వరకు బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. బాధితుల పక్షాన బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు.













