ప్రజల దృష్టిని మరల్చేందుకే.. ఆ రెండు పార్టీలు కుట్ర
తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించేందుకు ఎంఐఎం, టీఆర్ఎస్ కుట్ర పన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన సీఎం స్వయంగా శాంతి భద్రత సమస్య సృష్టించే కుట్ర చేయడం దుర్మార్గమన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఈడీ దాడుల నుంచి ప్రజల దృష్టిని పక్కదోవ పట్టించేందుకే ఈ కుట్ర చేశారని అన్నారు. పాత బస్తీతో ముస్లిం మేధావులు, అక్కడి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటూ ఉంటే ఎంఐఎం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయాలనుకుంటోందని విమర్శించారు. ప్రజల దృష్టి మరల్చేందుకే రెండు పార్టీలూ కుట్ర పన్నాయని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా, సంయమనంతో ఉండాలని కోరారు.
మునావర్ ఫారుఖీ అనే వ్యక్తి గతంలో ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించాడని, దీంతో అనేక రాష్ట్రాలు అతడి షోను నిషేధించాయని అన్నారు. అలాంటి వ్యక్తిని ఆహ్వానించి షో నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. గతంలో మునావర్ షోను హిందూ సంఘాలు వ్యతిరేకించడంతో షో కౌన్సిల్ అయ్యిందని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తితో హైదరాబాద్లో షో పెట్టించడం అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడం కాదా అని ప్రశ్నించారు.













