ఈ ఘటనపై సీబీఐ విచారణ జరగాల్సిందే : బండి సంజయ్
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరిగిన వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. మునుగోడులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ అర్వింద్, మాజీ ఎంపీ వివేక్‌తో కలిసి ఆయన మాట్లాడారు. మొయినాబాద్ సమీపంలోని ఫాంహౌస్ సీసీ పుటేజీలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఆ ఫాంహౌస్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేదేనన్నారు. అక్కడికి వచ్చింది, పోలీసులకు ఫిర్యాదు చేసిందీ, బాధితులుగా ఉన్నదీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలేనని తెలిపారు. ఈ తతంగాన్నంతా పోలీస్ కమిషనరే నడిపిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారం నుంచి ఆయన తప్పించుకుంటారా? ఆయన్ను నెవరు కాపాడతారు? అని వ్యాఖ్యానించారు. గత వారం రోజుల్లో ప్రగతిభవన్‌కు ఎవరెవరు వచ్చారు. ఢల్లీిలో సీఎం కేసీఆర్‌ను ఎవరు కలిశారనే విషయాలన్నీ బయటపెట్టాలి? సీపీ, ఎమ్మెల్యేలు, ఆ స్వామీజీలు కాల్ లిస్ట్ బయటకు తీయాలన్నారు.
సీఎం ఇంటి ల్యాండ్ ఫోన్ కాల్ లిస్ట్ కూడా బయట పెట్టాలి. సీఎం చెప్పిన స్క్రిప్ట్ ఒకటి. అక్కడ జరిగిందొకటి. డబ్బులు దొరికితే మీడియాకు చూపించాలి కదా? ఈ విషయాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దీనిపై హైకోర్టు ఆశ్రయిస్తామన్నారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరగాల్సిందే. మునుగోడు ఉప ఎన్నికతో ముడిపడిన సమస్య ఇది. అందుకే ఈసీ కూడా ఫిర్యాదు చేస్తాం. ఈ వ్యవహారంతో సంబంధం లేదని సీఎం కేసీఆర్ నిరూపించుకోవాలి. ఆయనకు సంబంధం లేకపోతే రేపు యాదాద్రికి వచ్చి ప్రమాణం చేయాలి. నేనూ వస్తా ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు అక్కడే ఉంటా. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేందుకు టీఆర్ఎస్ నేతలు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అని ఆరోపించారు.













