తెలంగాణ ప్రజలు కోరుకునేది కూడా ఇదే.. బండి సంజయ్
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సిట్ విచారణ చేపట్టాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సిట్ విచారణ జరపాలన్నదే బీజేపీ అభిప్రాయం అన్నారు. గౌరవ హైకోర్టు ఉత్తర్వులతో విచారణ పారదర్శకంగా జరిగే అవకాశముంది. బీజేపీ ప్రతిష్ఠను దెబ్బతీయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీపై ఆరోపణలు చేస్తూ ప్రెస్మీట్ నిర్వహించడమే ఇందుకు నిరద్శనం అన్నారు. సీఎం కేసీఆర్ ప్రెస్మీట్ నిర్వహించడం పట్ల హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు అభినందనీయం అన్నారు. సిట్ దర్యాప్తు పురోగతి వివరాలను బహిర్గతపర్చకూడదని, ఈ నెల 29లోపు పురోగతి నివవేదికను సీల్డ్ కవర్లో సింగిల్ జడ్జికి సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తప్పు చేసిన వాళ్లకు, కుట్రదారులకు శిక్ష పడాల్సిందే. తెలంగాణ ప్రజలు కోరుకునేది కూడా ఇదే. గౌరవ హైకోర్టు ధర్మాపనం పట్ల మాకు నమ్మకం ఉంది. వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం వెనుక కుట్రదారులెవరన్నది తేలడంతో పాటు దోషులకు తగిన శిక్ష పడుతుందనే నమ్మకం ఉంది అని అన్నారు.













