ముఖ్యమంత్రి కుటుంబమే దీనికి బాధ్యత.. వారినుంచే
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిన ఘటనపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ విమర్శలు చేశారు. కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో జమ్మి పూజ చేశారు. అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కుటుంబమే దీనికి బాధ్యత వహించాలని, జరిగిన నష్టాన్ని వారి నుంచే వసూలు చేయాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిపోవటం పట్ల దేశ ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇచ్చి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ నాణ్యతా ప్రమాణాల పట్ల లేనందునే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదంలో పడిందన్నారు.
రాజకీయ పార్టీల నేతలు ప్రాజెక్టును సందర్శిస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. మళ్లీ అధికారంలోకి రాలేరనే నాణ్యతకు తిలోదకాలు వదిలారని విమర్శించారు. ఈ ఘటనపై ఇప్పటికే తమ పార్టీ కేంద్రానికి ఫిర్యాదు చేసిందన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టులపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా దసరా తర్వాత చర్చించి ప్రకటిస్తామని తెలిపారు.













