ఉద్యోగులను తొలగించారంటే.. ఏ స్థాయిలో దందా నడుస్తుందో : బండి
డ్రగ్స్ తీసుకుంటున్నారని తెలిసి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే 15 మంది ఉద్యోగులను తొలగించారంటే, ఏ స్థాయిలో హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా నడుస్తుందో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరముందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ డ్రగ్స్ దందాపై తీసిన ఉడ్తా పంజాబ్ సినిమా మాదిరిగా ఉడ్తా హైదరాబాద్ సినిమా తీసే పరిస్థితి వచ్చిందని అన్నారు. పంజాబ్‌లో ప్రభుత్వం కూలిపోయిందంటే డ్రగ్స్ దందానే కారణమన్నారు. హైదరాబాద్‌లో ఉన్న యువత తల్లిదండ్రులు తమ పిల్లలు డ్రగ్స్ బారిన పడతారేమోనని ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నేతలు, కేసీఆర్ సన్నిహితుల హస్తం ఉన్నందునే డ్రగ్స్ దందా కొనసాగుతోందని ఆరోపించారు.
డ్రగ్స్‌పై సమీక్షల పేరుతో సీఎం కాలయాపన చేస్తున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. వెయ్యి మందితో కమిటీ వేసి డ్రగ్స్‌ను నిర్మూలిస్తామని గతంలో ప్రకటించారని, ఇచ్చిన హామీ ఏమైందో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. 2015 నాటి డ్రగ్స్ కేసు విచారణ మరుగున పడేశారని, కొందరి పేర్లు లీక్ చేసినా ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు. ఏ కేసు గురించైనా తొలుత సీఎం హల్చల్ చేస్తారు ఆ తర్వాత మరుగున పడేస్తారని విమర్శించారు. డ్రగ్స్ కేసు వివరాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈడీ లేఖ రాసినా స్పందించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదని ఈడీ హైకోర్టును ఆశ్రయించిందని అన్నారు.













