బీఆర్ఎస్ ఓడిపోతుందనే భయంతోనే.. ముందస్తుగా
రుణమాపీ విషయంలో రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా కరీంనగర్లో సంజయ్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ రూ.లక్ష వరకు రుణమాఫీ చేయకుండా రూపాయి తగ్గించి, రూ.99,999 చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రూ.లక్ష రుణం తీసుకున్న వారికి కూడా రుణమాఫీ చేయాలని అవసరమైతే మిగిలిన ఆ ఒక్క రూపాయిని రైతులే కట్టుకుంటారని తెలిపారు. 300 ఏళ్ల క్రితమే బహుజన రాజ్యాన్ని తేవాలని, గోల్కొండ కోటపై జెండా ఎగురవేయాలని పరితపించిన గొప్ప నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడారు. రాష్ట్ర ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని సీఎం మోసం చేశారని మండిపడ్డారు. దీనిపై నిరసనలు చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై పోలీసులతో దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఓడిపోతుందనే భయంతోనే ముందస్తుగా మద్యం దుకాణాలకు టెండర్లు పిలిచారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే కరవయ్యారని ఎద్దేవా చేశారు. టికెట్ల ఆశవహులకు రూ.50 వేలకు కాంగ్రెస్ దరఖాస్తులు అమ్ముకుంటోందని విమర్శించారు.













