కాంగ్రెస్ అభ్యర్థులను డిసైడ్ చేసింది కేసీఆరే: బండి సంజయ్
తెలంగాణ సీఎం కేసీఆర్, కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థులను కూడా కేసీఆరే నిర్ణయిస్తారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 30 మంది అభ్యర్థుల జాబితాను కేసీఆరే సిద్ధం చేశారని చెప్పారు. కాంగ్రెస్ నుంచి వాళ్లు గెలిస్తే.. అందరూ కట్టకట్టుకొని బీఆర్ఎస్లో చేరతారని జోస్యం చెప్పారు. అదే సమయంలో బీజేపీ నుంచి మాత్రం ఒక్కరు కూడా బయటకు వెళ్లరని స్పష్టం చేశారు. కరీంనగర్లో మహాజన్ సంపర్క్ అభియాన్లో భాగంగా ‘టిఫిన్ బైటక్’ కార్యక్రమం జరిగింది. దీనిలో పాల్గొన్న బండి సంజయ్.. పార్టీ కార్యకర్తలతో ముచ్చటించారు. ‘‘తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పుల పాలు చేశారు. అభివృద్ధి నిధులపై చర్చకు సీఎం వస్తారా? తెలంగాణ అభివృద్ధిపై చర్చ పెడితే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వస్తారు. పరేడ్ గ్రౌండ్లో చర్చకు మీరు సిద్ధమా?’’ అని సవాల్ చేశారు.
అలాగే హోం మంత్రి మహమూద్ అలీపై కూడా బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఆయన మహిళల దుస్తులపై కాకుండా.. ఉగ్రవాదులపై ఫోకస్ పెట్టాలని సూచించారు. అసలు మహమూద్ ఆలీ హోంమంత్రి అని రాష్ట్రంలో ఎవరికైనా తెలుసా? అని ఎద్దేవా చేశారు. మహిళలు గాజులు, బొట్టు పెట్టుకుంటే బలవంతంగా తీసేసినప్పుడు వీళ్లంతా ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్కు వస్తే కేసీఆర్ వణికిపోతారని చెప్పారు. ‘‘మేం అధికారంలోకి వస్తే కేసీఆర్ సర్కార్లోని మంచి పథకాలు కొనసాగిస్తాం. ధరణి మంచి పథకమే కానీ కేసీఆర్ కుటుంబానికి అది ఆసరాగా మారింది. ధరణిలో కొన్ని మార్పులు చేయాలి. అవి చేసి ఆ పథకాన్ని కొనసాగిస్తాం’’ అని తెలిపారు. హైదరాబాద్ దేశ రెండో రాజధానిపై పార్టీలో చర్చిస్తామని, తెలంగాణకు ఏది మంచో అదే చేస్తామని బండి సంజయ్ తేల్చిచెప్పారు.













