దళిత, గిరిజనులంటే మీకెందుకు అంత కక్ష ?
తెలంగాణలో దళిత, గిరిజనులంటే మీకెందుకు అంత కక్ష? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, గిరిజనులు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపార కార్యకలాపాలను నిలువరించాలని కోరారు. కొన్నేళ్ల నుంచి దళితులు, గిరిజనులకు కేటాయించిన భూములను లాక్కుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం దుర్మార్గం. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవడం అంటే వారి నోటికాడి ముద్ద లాక్కోవడమే అవుతుంది. దళితులకు మూడు ఎకరాల సాగుభూమిని ఇస్తామన్న హామీని నిలబెట్టుకోలేకపోయిన సీఎం, దళితులను మోసం చేశారు. ఇదిగో అదిగో పోడు భూములకు పట్టాలిస్తాం అంటూ హామీలివ్వడమే తప్ప అమలు చేసేది లేదు? మీ రియల్ ఎస్టేట్ దందాకు దళితులు, గిరిజనుల భూములను లాక్కుంటారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులకు, గిరిజనులకు రక్షణ లేకుండా పోయింది. వారి బతుకులను ఆగం చేసే చర్యలను ప్రభుత్వం వెంటనే మానుకోవాలి. అసైన్డ్ భూముల్లో రియల్ దందాకు తెరదించకుంటే పెద్దఎత్తున ఆందోళన చేపడతాం అని హెచ్చరించారు.













