పార్టీ కోసం కష్ట పడిన వారికే.. వ్యక్తుల కోసం కాదు
పార్టీ కోసం కష్టపడిన వారికే ఎన్నికల్లో టికెట్లు, వ్యక్తుల కోసం పనిచేసే వారికి టికెట్లు రావు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. పాదయాత్ర ముందు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీలో ముఖ్యమంత్రులవుతామని చెప్పుకునే వారు సీఎంలు కాలేరని స్పష్టం చేశారు. తాను పార్టీ అధ్యక్షుడైనప్పటికీ తన టికెట్‌పై కూడా స్పష్టత లేదని అన్నారు. యూపీ ఎన్నికల్లో టికెట్లు ఇప్పిస్తామని చెప్పుకున్న వారికి టికెట్ రాలేదని తెలిపారు. టికెట్లు ఇప్పిస్తామని కొందరు నాయకులు తిప్పుకుంటున్నారని, తిప్పుకున్న వారికి, తిరిగిన వారికి ఇద్దరికీ టికెట్లు రావని తేల్చి చెప్పారు. బీజేపీ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్ కూడా ఇదే విషయం స్పష్టం చేశారని పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు పని చేస్తున్నారని తెలిపారు.













