దమ్ముంటే గాంధీభవన్ ఎదుట నిరసన చెయ్: మంత్రి పొన్నంకు బండి సంజయ్ సవాల్
తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ పాలనలో ప్రజలకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఈ నెల 14వ తేదీన కరీంనగర్‌లో దీక్ష చేస్తానంటూ మంత్రి పొన్నం ప్రభాకర్.. ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై జగిత్యాల జిల్లా కథలాపూర్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ స్పందించారు.
మంత్రి వ్యాఖ్యలపై సీరియస్ అయిన ఆయన.. దమ్ముంటే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ గాంధీభవన్ ఎదుట దీక్ష చేయాలని సవాల్ విసిరారు. ‘‘80 కోట్ల మంది పేదలకు మోదీ అన్నం పెడుతున్నందుకు దీక్ష చేస్తారా..? కరోనా సమయంలో దేశంలోని ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందజేసినందుకు దీక్ష చేస్తారా? ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీర్‌ను భారత్‌లో అంతర్భాగం చేసినందుకు దీక్ష చేస్తారా? పౌరసత్వ చట్ట సవరణ (సీఏఏ) తెచ్చినందుకు దీక్ష చేస్తారా? దేని కోసం దీక్ష చేస్తారో చెప్పాలి’’ అంటూ పొన్నం ప్రభాకర్‌పై విరుచుకుపడ్డారు.
వందరోజుల్లో ఆరు గ్యారంటీలు పక్కాగా అమలు చేస్తామంటూ కాంగ్రెస్ గద్దెనెక్కిందని, కానీ ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆయన విమర్శించారు. గ్యారంటీలు అమలు చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. దమ్ముంటే రాష్ట్ర సర్కార్‌కు వ్యతిరేకంగా గాంధీ భవన్ ఎదుట నిరసన చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సలహా ఇచ్చారు. అలాగే గతంలో కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలూ దగా పడుతున్నప్పుడు ఎందుకు దీక్ష చేయలేదని, వడ్ల కుప్పలపై రైతులు గుండె పగలి చస్తుంటే ఎందుకు దీక్ష చేయలేదని నిలదీశారు.







