రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ.. రాజకీయ విమర్శలా ?
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ రాజకీయ విమర్శలు చేస్తారా? అని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ అంశంపై స్పీకర్ పైన చర్యలు తీసుకోవాలని, దీనిపై సభలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లు, జిల్లా ఇంచార్జ్‌లతో బండి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీని చూస్తేనే సీఎం కేసీఆర్ వణికిపోతున్నారని అన్నారు. అసెంబ్లీ నిర్వహించాలంటే భయపడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. విషయం ఏదైనా సరే ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. హిందూ పండుగలకు ప్రాధాన్యత లేకుండా కేసీఆర్ మహా కుట్ర చేస్తున్నాడు. షరతుల పేరుతో కన్ప్యూజ్ చేయడం అందులో భాగమే. హిందూ సమాజమంతా సంఘటితం కావాల్సిందేనని పిలుపునిచ్చారు.













