వైరస్ కావాలా? వ్యాక్సిన్ కావాలా? : బండి సంజయ్
బీఆర్ఎస్ ఓ వైరస్, బీజేపీ ఓ వ్యాక్సిన్, వైరస్ కావాలా? వ్యాక్సిన్ కావాలా? అనేది ప్రజలు తేల్చుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పాదయాత్రలో భాగంగా జగిత్యాల జిల్లా గంగాధర మండలం తుర్గాసిపల్లి శిబిరం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంజయ్ మాట్లాడారు. టీఆర్ఎస్కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు చేసిన తప్పుల చిట్టాను తన వద్ద పెట్టుకుని కేసీఆర్ వారిని బ్లాక్మెయిల్ చేస్తున్నారని విమర్శించారు. డ్రగ్స్ కేసు వ్యవహారాన్ని తాము వదిలిపెట్టబోమని తెలిపారు. తనను ప్రశ్నిస్తూ టీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిన ప్లెక్సీలపై సంజయ్ స్పందించారు. ఎంపీగా తానేం చేయాలో చేస్తున్నానని, మీరేం చేస్తున్నారో ముందు చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
నారాయణపూర్ రిజర్వాయర్ ముప్పు నిర్వాసితులను ఎందుకు పట్టించుకోరు? కొండగట్టు బస్సు ప్రమాద మృతుల కుటుంబాలను ఎందుకు ఆదుకోవడం లేదు? నయీమ్, డ్రగ్స్ కేసులపై గతంలో వేసిన సిట్ నివేదికలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తల సహనాన్ని పరీక్షించొద్దు. మేం ఫ్లెక్సీలు పెట్టడం మొదలు పెడితే మీరు ముఖం ఎత్తుకోలేరు. తెలంగాణ ప్రభుత్వం మారాలని ప్రజలంతా కోరుకుంటున్నారు అని అన్నారు.













