జల విహార్‌లో ఘనంగా అలయ్ బలయ్
చెడు మీద మంచి సాధించిన విజయమే విజయ దశమి అని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. జల విహార్‌లో అలయ్ బలయ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ తెలంగాణ సంప్రదాయాలకు దసరా పండుగ ప్రతీక అని, పార్టీలకు అతీతంగా అందరూ అలయ్ బలయ్‌లో పాల్గొనటం సంతోషమని అన్నారు. 15 ఏళ్లుగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. బతుకమ్మ, బోనాలు తెలంగాణ సమాజానికి గౌరవమని, నేటి యువత దేశభక్తి బావనను పెంపొందించుకోవాలన్నారు. భారతదేశం శాంతికి నిలయమని, భావి తరాలకు తెలంగాణ సంప్రదాయాన్ని తెలియజేయాలన్నారు. హిమచల్, తెలంగాణ రాష్ట్రాలను అనుసంధాన కర్తగా వ్యవహరిస్తానని దత్తాత్రేయ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళి సైతో పాటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, వీహెచ్, కేకే, లక్ష్మణ్, మురళీధరరావు, మేయర్ బొంతు రామ్మోహన్, ఎల్.రమణ, కనుమూరి బాపిరాజుతో, పాటు టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ నేతలు హాజరయ్యారు.













