బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి ముహూర్తం ఖరారు
హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని ఈ నెల 20వ తేదీన నిర్వహించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయాన్ని మంత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద నూతనంగా నిర్మించిన భక్తుల నూతన క్యూ లైన్ ను, రుద్రాక్ష మండపం నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం అమ్మవారి కళ్యాణానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. గత సంవత్సరం అమ్మవారి కళ్యాణాన్ని 8 లక్షల మంది భక్తులు తిలకించారని వెల్లడిరచారు. ఈ సంవత్సరం భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. 20వ తేదీన జరిగే అమ్మవారి కల్యాణానికి, 21వ తేదీన నిర్వహించే రథోత్సవానికి వచ్చే లక్షలాది మంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పటిష్టమైన బారికేడ్ లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.













