అది పాదయాత్ర కాదు.. పాపాలను కడుక్కునే యాత్ర
తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్‌ది పాదయాత్ర కాదు, పాపాలను కడుక్కునే యాత్ర అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. టీఆర్ఎస్ఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకోవడం సరికాదన్నారు. అడ్డుకోవడమే మీ పని అయితే కిషన్ రెడ్డి తెలంగాణలో తిరగలేడు అన్నారు. బండి సంజయ్ పాదయాత్ర చేయలేడని హెచ్చరించారు. బీజేపీ నేతలది ఓర్వలేని తనమని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని తెలిపారు. అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. మోదీ అసమర్థత వల్ల దేశంలో కరెంట్ కోతలు ఏర్పడ్డాయన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో జగ్గారెడ్డి ఎక్కడున్నారు? అని ప్రశ్నించారు. జగ్గారెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. ఓయూకే వచ్చే ముందు తెలంగాణ ప్రజలకు రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ పబ్బం గడుపుకునేందుకు రాహుల్ పర్యటన అని పేర్కొన్నారు. తెలంగాణకు రాహుల్ గాంధీ వచ్చి చేసేదేమీ లేదని అన్నారు. సొంత రాష్ట్రంలో రాహుల్ తన పార్టీని గెలిపంచుకోలేదని ధ్వజమెత్తారు.













