రికార్డ్ : బాలాపూర్ లడ్డూ రూ.15లక్షల 60వేలు
బాలాపూర్ లడ్డూ వేలం ఆసక్తికరంగా సాగింది. పోటాపోటీగా సాగిన వేలంలో నాగం తిరుపతిరెడ్డి 15లక్షల 60వేల రూపాయలకు గణేశ్ మహా ప్రసాదాన్ని దక్కించుకున్నాడు. గత ఏడాది కంటే 95వేల రూపాయలు ఎక్కువకు పలికింది ఈసారి. నాగం తిరుపతిరెడ్డి.. జూబ్లీహిల్స్ అయ్యప్ప సొసైటీకి చెందిన వ్యాపారి. ఆయనకు బాలాపూర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రసాదం అందించారు. ఎంతోకాలంగా లడ్డూ వేలంలో పాల్గొంటున్నానని.. ఈసారి దక్కించుకోవటం ఆనందంగా ఉందన్నారు తిరుపతిరెడ్డి.
గత చరిత్ర:
కొన్నేళ్లుగా లడ్డూ వేలంలో రికార్డులు సృష్టిస్తోంది బాలాపుర్ గణేశ్. దీన్ని సొంతం చేసుకుంటే గణపతి కటాక్షం దొరుకుతుందని భక్తులు సెంటిమెంట్ గా భావిస్తున్నారు. అందుకే బాలాపూర్ లడ్డుకి లక్షలు పెట్టడానికి కూడా భక్తులు వెనకాడరు. 1994ల బాలాపూర్ లడ్డూ వేలం ప్రక్రియ మొదలైంది. తొలిసారిగా కొలన్ మోహన్ రెడ్డి 450 రూపాయలకు లడ్డూను దక్కించుకున్నరు. అప్పటి నుంచి..డిమాండ్ పెరగడమే కానీ తగ్గడమనేది లేదు. ఆటెంక 1995ల కూడా కొలన్ మోహన్ రెడ్డే 4 వేల 500 కు సొంతం చేసుకున్నారు. ఇక 1996ల కొలన్ కృష్ణారెడ్డి 18 వేలు, 1997ల మళ్లీ కొలన్ కృష్ణారెడ్డి 28 వేలు. 1998ల కొలన్ మోహన్ రెడ్డి 51 వేలకు సొంతం చేసుకున్నారు.
1999 ల ఫస్ట్ టైం కొలన్ ఫ్యామిలీ నుంచి చేతులు మారింది బాలాపూర్ లడ్డు. కల్లెం ప్రతాప్ రెడ్డి 65 వేలకు దక్కించుకున్నరు, 2000 ల కల్లెం అంజిరెడ్డి 66వేలకు సొంతం చేసుకున్నారు. 2001ల రఘునందన్ చారి 85వేలు, 2002ల కందాడ మాధవ రెడ్డి లక్షా 5 వేలు, 2003ల చిగురింత బాల్ రెడ్డి లక్షా 55 వేలు దక్కించుకున్నారు. 2004ల మరోసారి కొలన్ మోహన్ రెడ్డి 2 లక్షల ఒక వెయ్యికి సొంతం చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ బూమ్ తో బాలాపూర్ లడ్డూ రేటు ఏడాదికింత పెరిగింది. 2005ల ఇబ్రహమ్ శేఖర్ 2 లక్షల 8 వేలు, 2006ల చిగురింత తిరుపతి రెడ్డి 3 లక్షలు, 2007ల రఘునందన్ చారి 4 లక్షల 15 వేలు, 2008ల కొలన్ మోహన్ రెడ్డి 5 లక్షల 7 వేలు, 2009ల సరిత 5 లక్షల 10 వేలు, 2010లో కొడాలి శ్రీధర్ బాబు 5 లక్షల 35 వేలకు దక్కించుకున్నారు. 2011ల కొలన్ ఫ్యామిలీ 5 లక్షల 45 వేలు, 2012ల పన్నాల గోవర్దన్ రెడ్డి 7 లక్షల 50 వేలు, 2013లో తీగల కృష్ణారెడ్డి 9 లక్షల 26 వేలకు సొంతం చేసుకున్నారు. 2014లో సింగిరెడ్డి జయేందర్ రెడ్డి 9 లక్షల 50 వేలతో లడ్డూ దక్కించుకున్నారు. 2015ల కళ్లెం మదన్ మోహన్ రెడ్డి… 10 లక్షల 32 వేలు, పోయినేడు కందాడి స్కైలాబ్ రెడ్డి 14 లక్షల 65 వేలకు సొంతం చేసుకున్నారు. ఈ సారి ఎంత ధర పలుకుతుందోనని ఆసక్తిగా చూస్తున్నారు భక్తులు.
బాలాపూర్ గణేశ్ కి వచ్చే డబ్బును చుట్టు పక్కల ఆలయాల ఆధునీకరణ, స్కూళ్లలో మౌలిక వసతులకు ఖర్చు చేస్తారు నిర్వాహకులు. మహబూబ్ నగర్ వరద బాధితులకు కూడా బాలాపూర్ గణేష్ తరపున ఆర్థికసాయం అందించారు.













