తెలంగాణలో మరో ఆనందయ్య… కరోనాకు

తెలంగాణలో మరో ఆనందయ్య కోరనా వ్యాధికి వైద్యం అందిస్తున్నాడు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండల కేంద్రానికి చెందిన బచ్చలి భీమయ్య అనే విశ్రాంత సింగరేణి కార్మికుడు కరోనాకు ఆయుర్వేద వైద్యం అందిస్తున్నాడు. ఆనందయ్యకు తీసిపోని విధంగా కరోనా వచ్చిన వారికి నమయం చేస్తూ కరోనా వ్యాధి సోకిన వారి వద్దకు ఎలాంటి మాస్కులు లేకుండా వారిని ప్రక్కన కూర్చోబెట్టుకొని వారిలో ధైర్యాన్ని నింపుతూ ఆయుర్వేద మందును అందిస్తున్నాడు. ఇప్పటి వరకు 400 మందికి ఆయుర్వేద మందును అందించినట్లు ఆయన పేర్కొన్నారు. బచ్చలి భీమయ్య వైద్యం గురించి సోషల్ మీడియాలో వైరల్ కావడం, పలువురు ఆయన వద్దకు వైద్యం కోసం వస్తుండటంతో మందమర్రి పోలీసులు అతన్ని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‍కు తీసుకెళ్లారు.
ప్రభుత్వం నుంచి అనుమతులు లేనందున వైద్యాన్ని ఏ విధంగా అందిస్తున్నారని ఆరా తీసుకున్నారు. గత 20 సంవత్సరాల నుంచి మందమర్రి చుట్టుపక్క ప్రాంతాల్లోని ప్రజలకు ప్రతీ ఆదివారం తనకు తెలిసిన వైద్యాన్ని అందించేవారు. ఈ క్రమంలో కరోనా తీవ్రత వైరస్ ప్రారంభమైనప్పటి నుంచి రోగుల్లో రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు వ్యాధిని నయం చేసేందుకు తన వైద్యం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలియజేస్తున్నాడు. ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులను మంజూరు చేస్తే తన ఆయుర్వేద వైద్యాన్ని కరోనా పేషెంట్లకు అందిస్తూ సహకరిస్తానని పేర్కొంటున్నాడు.