మంత్రి కేటీఆర్‌ను కలిసిన అజహరుద్దీన్
హైదరాదాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ పలు అంశాలపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం అజహర్ మీడియాతో మాట్లాడుతూ క్రికెట్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకారమందించాలని కేటీఆర్‌ను కోరినట్లు తెలిపారు. దీనికి ఆయన సుముఖత వ్యక్తం చేశారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి పెద్ద పీట వేస్తోందని తెలిపారు. త్వరలోనే సీఎం కేసీఆర్‌ను కూడా కలిసి క్రికెట్ అభివృద్ధికి సహకరించాలని కోరతానని అన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అందరనీ కలిసి క్రికెట్ అభివృద్ధికి సహకారం కోరుతానని వివరించారు. పార్టీ మారడంపై అజహర్‌ను మీడియా ప్రశ్నింగా కేవలం రాష్ట్రంలో క్రికెట్ రంగాన్ని అభివృద్ధి చేయడమే తన ముందున్న లక్ష్యమని సృష్టం చేశారు.













